రూపు మారుతున్న మహమ్మారితో దేశానికి పెను సవాళ్లు: నరేంద్ర మోదీ

పదే పదే రూపం మార్చుకుంటున్న కరోనా మహమ్మారితో దేశం పెను సవాళ్లను ఎదుర్కొనే ముప్పుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ సమయంలో అది నిరూపితమైందని అన్నారు. ఆ మహమ్మారి వైరస్ లో మ్యుటేషన్లు జరిగే ముప్పు పొంచి ఉందని ఆయన చెప్పారు. కాబట్టి కరోనా పోరాటంలో మన సన్నద్ధతను మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ నేపథ్యంలోనే ఇవ్వాళ ఆయన ముందు వరుస యోధులకు క్రాష్ కోర్స్ ప్రోగ్రామ్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పీపీఈ కిట్లు, టెస్ట్ కిట్లు, మౌలిక వసతుల కల్పన, కరోనా చికిత్సలు, దానికి సంబంధించిన వైద్య పరికరాల సమీకరణ వంటి విషయాల్లో భారత్ కు అతిపెద్ద నెట్ వర్క్ ఏర్పడిందని ఆయన చెప్పారు. ఎక్కువ ఆసుపత్రులకు ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దేశంలో 1,500 ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం సాగుతోందని చెప్పారు.

ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా లక్ష మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు శిక్షణను ఇవ్వనున్నారు. హోమ్ కేర్ సపోర్ట్, బేసిక్ కేర్ సపోర్ట్, అడ్వాన్స్డ్ కేర్ సపోర్ట్, ఎమర్జెన్సీ కేర్ సపోర్ట్, శాంపిల్ సేకరణ, వైద్య పరికరాలకు సంబంధించిన అంశాల్లో వారికి శిక్షణను ఇస్తారు.

ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రూ.276 కోట్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వైద్యేతర ఆరోగ్య సిబ్బందిలో నైపుణ్యాలను మెరుగుపరచవచ్చని, దీంతో ప్రస్తుతం, భవిష్యత్తులో ఆరోగ్య రంగంలో సిబ్బంది కొరత కొద్దిగా తీరే అవకాశం ఉంటుందని ప్రధాని కార్యాలయం పేర్కొంది.