అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను

అమెరికా మంచు గుప్పిట్లో చిక్కుకున్నది. పలు రాష్ట్రాల్లో మంచు తుఫాన్‍ బీభత్సం సృష్టిస్తున్నది. చలిగాలుల తీవ్రతకు ఇప్పటివరకు 20 మంది చనిపోయారు. టెక్సాస్‍, లూసియానా, మిసిసిప్పిలో మంచు ధాటికి విద్యుత్తు గ్రిడ్లు దెబ్బతిన్నాయి. ఆయా నగరాల్లో దాదాపు 30 లక్షల మంది అంధకారంలో ఉన్నారు. విద్యుత్తు పునరుద్ధరణకు చర్యలు చేపట్టినప్పటికీ మంచు ఆటంకం కలిగిస్తున్నది. నగరాల్లో కరెంట్‍ రావాలంటే మరింత సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఇక్కడ -22 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్నది. విద్యుత్తు లేకపోవడంతో ఇండ్లలోపల కూడా వేడి కాచుకోవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో వేడి కోసం పెడుతున్న నిప్పు ఇతర గదులకు వ్యాపించి చనిపోయిన ఘటనలు నమోదవుతున్నాయి. మంచు తుఫాన్‍ ప్రభావం దాదాపు 10 కోట్ల మందిపై ఉంటుందని అధికారులు అంచనా వేశారు. టెక్సాస్‍కు మరో మంచు తుఫాన్‍ ముప్పు పొంచి ఉన్నట్టు శాస్త్రవేత్తలు హెచ్చరించారు. టెక్సాస్‍లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. వందల విమాన సర్వీసులు రద్దయ్యాయి.

మంచు కారణంగా అమెరికాలో కరోనా వ్యాక్సినేషన్‍కు అంతరాయం ఏర్పడింది. నార్త్ కరోలినాలో టోర్నడో బీభత్సంలో ముగ్గురు చనిపోయారు. 10 మంది గాయపడ్డారు. మరోవైపు సిరియా, లెబనాన్‍, ఇజ్రాయెల్‍లో కూడా భారీ హిమపాతం సంభవించింది. మంచుతో రోడ్లన్నీ మూసుకుపోయాయి. ధ్రువాల వద్ద నుంచి వచ్చే చల్లని గాలుల (పోలార్‍ వర్టెక్స్) వల్లే అమెరికాలో ఈ అసాధారణ పరిస్థితులు నెలకొన్నట్టు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా ఇవి ఆర్కిటిక్‍ ధ్రువానికే పరిమితం అవుతాయని, భూతాపం కారణంగా ఇటీవల దక్షిణం వైపునకు కదులుతున్నాయని పేర్కొన్నారు.