Covaxin కి బ్రిటన్‌ ఆమోదం.. విదేశీ ప్రయాణికులకు ‘నో’ క్వారంటైన్‌

చైనాకు చెందిన సినోవాక్‌, సినోఫార్మ్‌, భారత్‌లకు చెందిన కొవాగ్జిన్‌లను బ్రిటన్‌ ఆమోదించిన వ్యాక్సిన్‌ల జాబితాలో చేర్చింది. నవంబర్‌ 22 నుండి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో యుఎఇ, మలేషియా, భారత్‌లతో పాటు కొవాగ్జిన్‌ తీసుకున్న వారికి ప్రయోజనం కలగనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ జాబితాలో చేర్చిన కరోనా వ్యాక్సిన్‌లను ఈ నెలాఖరులోపు గుర్తిస్తామని బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే 18 ఏళ్లకంటే తక్కువ వయసున్న వారు, రెండు డోసుల వ్యాక్సిన్‌లు తీసుకున్నవారు క్వారంటైన్‌ కేంద్రాలకు వెళ్లకుండా నేరుగా దేశంలోకి అనుమతించేలా ప్రయాణ నియమాలను మరింత సరళీకృతం చేయనున్నట్లు ఆదేశ రవాణా శాఖ సోమవారం వెల్లడించింది.