కాగ్నిజెంట్ ఎంప్లాయీస్ కు బంపర్ ఆఫర్

ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు వేతనాల పెంపు, ప్రమోషన్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. నాలుగో క్వార్టర్‌లో వీటిని అమలు చేయనుంది. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి టెక్ దిగ్గజాలు వేతనాల పెంపు, ప్రమోషన్లు ప్రకటించాయి. ఇప్పుడు కాగ్నిజెంట్ అదేదారిలో నడుస్తున్నది. కాగ్నిజెంట్ సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలు నిరాశపరిచాయి. నికర లాభం 30 శాతం క్షీణించి 348 మిలియన్ డాలర్ల(రూ.2,578 కోట్లు)కు పరిమితమైంది. డిజిటల్ వ్యాపారంలో బలమైన గణాంకాలు నమోదు చేసినట్లు తెలిపింది. 2019 సెప్టెంబర్ క్వార్టర్‌లో 497 మిలియన్ డాలర్లుగా నమోదయింది.

ఆదాయంలో మాత్రం పెద్దగా మార్పులేదు. 4.2 బిలియన్ డాలర్లుగా నమోదయింది. కరోనా కష్టకాలంలోను మంచి పనితీరును కనబరిచామని, డిజిటల్ వ్యాపారంలో బుకింగ్స్ పెరిగాయని, సాధారణ వ్యాపారంలో బుకింగ్స్ ఏడాది నుండి ఇప్పటి వరకు 15 శాతం పెరిగిదే, డిజిటల్ బుకింగ్స్ 40 శాతం పెరిగాయని కాగ్నిజెంట్ సీఈవో బ్రెయిన్ హాంప్రీస్ అన్నారు.

సెప్టెంబర్ త్రైమాసికంలో ఆట్రిషన్ 18 శాతంగా నమోదయింది. ఇతర ఐటీ కంపెనీలతో పోలిస్తే ఆట్రిషన్ ఎక్కువగా ఉంది. ఈ త్రైమాసికంలో దాదాపు 2,000 మంది ఉద్యోగులను కొత్తగా చేర్చుకుంది. దీంతో మొత్తం ఉద్యోగాలు 2.83 లక్షలకు చేరుకున్నాయి. కాగా, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ప్రమోషన్లు, వేతనాల పెంపు అమలు చేయనున్నట్లు ప్రకటించాయి.