రైతులు పూజించుకునే యంత్రాలు తగలబెట్టడం.. రైతులను అవమానించడమే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న వారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు నష్టపోయినా లెక్క లేదా. కేవలం దళారులు లాభపడాలన్నదే ప్రతిపక్షాల ఉద్దేశమని మండిపడ్డారు. నూతనంగా ఏర్పడిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని ఇండియా గేటు వద్ద ట్రాక్టర్‌ను దహనం చేసిన ఘటనను ప్రధాని మోదీ తప్పుపట్టారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉత్తరాఖండ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను మంగళవారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో కార్మికులు, రైతులు, ఆరోగ్యానికి సంబంధించి పలు సంస్కరణలు తీసుకువచ్చామని, ఈ సంస్కరణలు దేశంలోని కార్మికులు, యువత, మహిళలు, రైతులను బలోపేతం చేస్తాయని అన్నారు. అయితే కొంతమంది వీటిని ఎలా వ్యతిరేకిస్తున్నారో దేశం చూస్తుందని అన్నారు. రైతులు పూజించుకునే యంత్రాలు, పరికరాలకు  పెట్టడం ద్వారా కొందరు వ్యక్తులు రైతులను అవమానించారని అన్నారు. కాగా, ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఇండియా గేట్‌ ఎదుట కాంగ్రెస్‌ యువజన విభాగం ట్రాక్టర్‌ను తగులబెట్టి తమ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బిజెపి పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో సైతం రైతులు ఈచట్టాలను నిరసిస్తూ.. సోమవారం ఆందోళన చేపట్టడం గమనార్హం.