మమత వర్సెస్ బీజేపీ.. ప్రారంభమైన భవానీపూర్ ఉప ఎన్నిక పోలింగ్

పశ్చిమ బెంగాల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలోని ఒక స్థానానికి గురువారం ఉదయం ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ సాయంత్రం 6.30గంటల వరకు కొనసాగనుంది. అయితే.. ఈ ఉప ఎన్నికలల్లో పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కూడా పోటీ చేస్తున్నారు. బెంగాల్‌లోని భవానీ పూర్‌ నియోజకవర్గం నుంచి మమతా పోటీలో ఉన్నారు. దీంతో ఈ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ప్రాధ్యాన్యత ఏర్పడింది.

ఈ ఏడాది మొదట్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి పోటీచేసిన మమతా బెనర్జీ.. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం దీతీ తన సొంత నియోజకవర్గమైన భవానీ పూర్‌ నుంచి బరిలో ఉన్నారు. దీదీపై న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ చేయడం లేదు. బెంగాల్‌లోని భవానీపూర్‌తోపాటు జాంగీపూర్‌, సంపేర్‌గంజ్‌ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరుగుతోంది. అక్టోబర్‌ 3న ఓట్లను లెక్కించనున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. 15 కంపెనీల కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా.. భవానీపూర్‌ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ 2011, 2016 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్థి సువేందు అధికారిపై వేయి ఓట్ల తేడాతో ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మమతా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అందువల్ల ఆమె ఆరు నెలల్లో ఏదో ఒక సభ నుంచి చట్ట సభకు ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ కోసం భవానీపూర్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సుభతా బక్షి తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన జంగీర్‌పూర్‌ నుంచి బరిలో ఉన్నారు.