రాజధాని నిధులు కేంద్రమే భరించాలి: సదరన్‌ కౌన్సిల్లో ప్రభుత్వం ప్రతిపాదన

రాజధాని నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది. నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రమే ఇవ్వాలని ప్రతిపాదించింది. దీనికి అవసరమైన విధంతా ఎపి పునర్విభజన చట్టంలో మార్పులు చేయాలని కోరనుంది. త్వరలో తిరుపతిలో జరగనున్న సదరన్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రతిపాదించినట్లు తెలిసింది. కొద్దికాలంగా రాజధాని వ్యవహారం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించుకున్న ప్రభుత్వం ఇప్పుడు రాజధానికి నిధులు ఇవ్వాలనే ప్రతిపాదన పెట్టడం చర్చనీయాంశం అవుతోంది. పైగా పునర్విభజన చట్టాన్ని సవరించాలని కోరడంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మూడు రాజధానుల అభివృద్ధికి కేంద్రం సాయం కావాలని, అయితే అది కోర్టులో ఉందని దీనిపైనా త్వరలోనే స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉందని తెలిపింది. రాజధాని భూ సమీకరణ సమయంలో జరిగిన అనేక అవకతవకలు జరిగినట్లు తేలిందని, దీనిపైనా విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిసింది. అలాగే నిధులు ఎంత అవసరం అనేది శాస్త్రీయ పద్ధతిలో మరోసారి తేల్చి కేంద్రానికి నివేదిస్తామని సదరన్‌ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది.