Covaxinతో 77.8 శాతం రక్షణ

కరోనా తీవ్రత నుండి కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ 77.8 శాతం రక్షణ కల్పిస్తుందని భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను లాన్సెట్‌ వెల్లడించిన నేపథ్యంలో భారత్‌ బయోటెక్‌ ఈ ప్రకటన చేసింది. కరోనా వైరస్‌ను క్రియారహితంగా మార్చే సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ రెండు డోసులు ఇచ్చిన రెండు వారాల అనంతరం శరీరానికి బలమైన యాంటీబాడీలను అందిస్తుందని లాన్సెట్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 2020 నవంబర్‌ మరియు 2021 మే మధ్య 18-97 ఏళ్ల వయస్సు కలిగిన 24,419 మంది పాల్గొనే క్లినికల్‌ ట్రయల్స్‌లో ప్రతికూల మరణాలు నమోదుకాలేదని మెడికల్‌ జర్నల్‌ తెలిపింది. క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో 0.5 శాతం కంటే తక్కువ మందిలో మాత్రమే తీవ్ర దుష్పరిణామాలు తలెత్తినట్లు తెలిపింది. డెల్టా వేరియంట్‌ సోకకుండా కొవాగ్జిన్‌ 65.2 శాతం కాపాడగలదని.. అన్ని రకాల కొవిడ్‌ స్ట్రైన్స్‌ నుంచి 70.8 శాతం రక్షణ ఇస్తుందని స్పష్టం చేసింది.