యూనిసెఫ్‌ సహకారంతో విద్యార్థుల కోసం ‘కెరీర్‌ పోర్టల్‌’

ఒడిశా ప్రభుత్వం యూనిసెఫ్‌ సహకారంతో ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం ‘కెరీర్‌ పోర్టల్‌’ను ప్రారంభించింది. ఈ పోర్టల్ సహాయంతో విద్యార్థులు కెరీర్‌కు సంబంధించి ఎలాంటి అవకాశాలున్నాయో తెలుసుకోవడంతో పాటు నేరుగా ఉపాధ్యాయులతో మాట్లాడేందుకు అవకాశం కూడా ఉంది. ఈ పోర్టల్‌ను ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ను కూడా రూపొందించారు. దీంతో విద్యార్థులు భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేందుకు సేవలను కూడా పొందవచ్చు. విద్యార్థులు www.odishacareerportal.com వెబ్‌సైట్‌లోకి లాగినై.. ఐడీ, పాస్‌వర్డ్‌ టైప్‌ చేసి సేవలను వినియోగించుకోవచ్చు. సమాచారం ఇంగ్లిష్‌తో పాటు ఒడియాలో అందుబాటులో ఉంచారు. కెరీర్‌, కళాశాలలు, వృత్తి విద్యా సంస్థలు, స్కాలర్‌షిప్‌ ఇలా సమస్త సమాచారాన్ని అందుబాటులో ఉంచారు.

పోర్టల్‌లో సుమారు 550కిపైగా కెరీర్‌ మార్గాలపై సమాచారం ఉందని, 2,62,000కుపైగా విద్యార్థులు 17వేలకుపైగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలలు, ఒడిశాతో సహా దేశంలోని వృత్తి సంస్థల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే దరఖాస్తు విధానంతో సహా 1,150 ప్రవేశ పరీక్షలకు సంబంధించిన సమగ్ర సమాచారం, భారత్‌తో పాటు విదేశాల్లోని ఉన్నత విద్య కోసం ఉన్న 1,120 స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ మంత్రి సమీర్‌ రంజన్‌ మాట్లాడుతూ విద్యార్థులకు పోర్టల్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. యూనిసెఫ్‌ చీఫ్ ఫీల్డ్ ఆఫీస్ మోనికా నీల్సన్ మాట్లాడుతూ ఒడిశా కెరీర్ పోర్టల్ రాష్ట్రంలోని సెకండరీ, హయ్యర్ సెకండరీ విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ముఖ్య సాధనంగా ఉంటుందని తెలిపారు.