దళిత మహిళ సర్పంచ్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వైసీపీ నేతలపై కేసు నమోదు చేయాలి: నాదెండ్ల మనోహర్

• సర్పంచ్ కి అండగా ఉన్న జనసేన నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులా?
• దళితులపై దాడులు పెరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదు

తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని చల్లూరు గ్రామంలో దళిత నుంచి సర్పంచ్ గా ఎన్నికైన శ్రీమతి దాసి మీనా కుమారి విషయంలో అనుచితంగా వ్యవహరించిన వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేయకుండా పోలీసులు మౌనంగా ఉండటం దురదృష్టకరం, తన గౌరవానికి భంగం వాటిల్లే విధంగా గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ శ్రీ తోట త్రిమూర్తులు, ఆయన అనుచరులు ప్రవర్తించారని శ్రీమతి మీనా కుమారి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేయడం లేదు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ, గ్రామ సర్పంచ్ కి దక్కాల్సిన ప్రోటోకాల్ కూడా కాదని ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకొనేందుకు పోలీసులు వెనకాడటం వెనక కచ్చితంగా అధికార పార్టీ ఒత్తిళ్ళు ఉన్నాయి. దళిత మహిళ అయిన సర్పంచ్ కి అండగా నిలిచిన మండపేట నియోజకవర్గం జనసేన ఇంచార్డ్ పై వేగుళ్ళ లీలాకృష్ణ, ఇతర జనసేన నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు. చేయడం చూస్తుంటే పోలీసు అధికారులను అధికార పక్షం ఎలా వాడుకొంటుందో అర్ధం అవుతోంది. పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించడంపై జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా నాయకులు ప్రజాస్వామ్య విధానంలో నిరసనలు తెలియచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళాం. ఈ కేసు విషయంలో రామచంద్రపురం డీఎస్పీ శ్రీ బాలచంద్రారెడ్డి వైఖరి, కేసును పక్కదోవ పట్టిస్తున్న విధానం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. చట్ట విరుద్ధంగా అధికార పక్షానికి పోలీసులు అండగా ఉండటం వల్లే రాష్ట్రంలో దళితులపై దాష్టీకాలు పెరుగుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక తూ.గో. జిల్లా రాజానగరం నియోజకవర్గంలో దళిత యువకుడికి పోలీసులే శిరోముండనం చేసిన ఘటన చోటు చేసుకొంది. అదే జిల్లాలో సామర్లకోట పోలీసుల వేధింపులకు ఓ దళిత యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దళితులపైనే ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు దళితులకు అండగా నిలిచినవారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడం వల్లూరు ఘటనలో చూస్తున్నాం. ఇప్పుడే కాదు గతంలోనూ దళితులపై దాడులు చేసిన చరిత్ర ఉన్నవారికి మాత్రం రక్షణ ఇస్తున్నారు. ఇది కచ్చితంగా చట్ట విరుద్ధమే. సర్పంచ్ శ్రీమతి మీనా కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేసి తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలి. జనసేన నేతలపై వేధింపులు ఆపాలి లేని పక్షంలో పార్టీ నాయకత్వం పోరాటానికి సిద్ధమవుతుంది. ఈ కేసును పక్కదోవ పట్టిస్తున్న గురించి జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. వారిపైనా, రాష్ట్రంలో దళితులపై సాగుతున్న దాష్టీకాలు గురించి జాతీయ ఎస్సీ కమిషన్ కు పిర్యాదు చేస్తాం అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.