కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

రాష్ట్రాలకు కేంద్రం అందించే ఉచిత కరోనా వ్యాక్సిన్లకు కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. వీటి ప్రకారం ఇక నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జనాభా, కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్ పురోగతి ఆధారంగా వ్యాక్సిన్లను పంపిణీ చేయనున్నారు. అంతేకాదు వ్యాక్సిన్ వృథా ఎక్కువగా ఉంటే ఇవ్వబోయే వ్యాక్సిన్ల సంఖ్యలో కోత ఉంటుందని కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 21 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన మరుసటి రోజే ఈ కొత్త మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.

పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృథా ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం చెబుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. జార్ఖండ్‌లో అత్యధికంగా 37 శాతం వ్యాక్సిన్ వృథా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఛత్తీస్‌గఢ్ (30 శాతం), తమిళనాడు (15.5 శాతం), జమ్మూకాశ్మీర్ (10.8 శాతం), మధ్యప్రదేశ్ (10.7 శాతం) ఉన్నాయి. వ్యాక్సిన్ల వృథాలో జాతీయ సగటు 6.3 శాతం కాగా.. ఈ రాష్ట్రాలు అంతకన్నా ఎక్కువగా వృథా చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

వ్యాక్సినేషన్‌పై కొత్త మార్గదర్శకాలు:

 18 ఏళ్లు నిండిన వాళ్లందరికీ వ్యాక్సిన్లు ఇస్తున్న నేపథ్యంలో వీళ్లలో ప్రాధాన్యతా క్రమం నిర్ణయించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకే ఉంటుంది.

 వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి, కొత్త వ్యాక్సిన్లన ప్రోత్సహించడానికి మొత్తం ఉత్పత్తిలో 25 శాతం నేరుగా ప్రైవేటు హాస్పిటల్స్‌కు అమ్ముకునే అవకాశం తయారీదారులకు కల్పించారు.

 ప్రైవేటు హాస్పిటల్స్‌కు అమ్మే ధరను ప్రతి వ్యాక్సిన్ తయారీదారు ప్రకటించాలి. అందులో మార్పులను ఎప్పటికప్పుడు తెలియజేయాలి. ప్రైవేటు హాస్పిటల్స్ గరిష్ఠంగా సర్వీస్ చార్జీల రూపంలో రూ.150 వసూలు చేయాలి. ఈ ధరలను రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షించవచ్చు.