వ్యాక్సిన్ సింగిల్ డోసుపై కేంద్రం అధ్యయనం!

దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో కోవిడ్ వ్యాక్సిన్ ట్రాకర్ ప్లాట్‌ఫామ్ నుంచి డేటాను సేకరించిన ప్రభుత్వం కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ మోతాదుల మధ్య విరామాన్ని పెంచే అంశంపై సమీక్షించనుంది. దేశంలో జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రజలకు కోవిషీల్డ్ లేదా కోవ్యాక్సిన్ టీకా ఇస్తున్నారు. కొద్దిమందికి స్పుత్నిక్ వీ ఇచ్చారు.

ఈ సందర్భంగా నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఎజిఐ) కోవిడ్ వర్కింగ్ గ్రూప్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్‌కే అరోరా మాట్లాడుతూ మార్చి, ఏప్రిల్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల ప్రభావాన్ని అధ్యయనం చేయవలసిన అవసరంపై చర్చ ప్రారంభమైందన్నారు. సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఎంతవరకూ ప్రభావవంతమో తెలుసుకునేందుకు కూడా సమీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా జాన్సన్ అండ్‌ జాన్సన్ సింగిల్ డోస్ టీకా కూడా వైరల్ వెక్టర్ ప్లాట్‌ఫారంపై ఆధారపడింది, డబుల్ డోస్ స్పుత్నిక్ టీకా కూడా ఇప్పుడు ఒకే మోతాదుతో వస్తోంది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కూడా ఒకే మోతాదు వ్యాక్సిన్‌గా రూపొందింది. కాగా సింగిల్ డోస్ టీకాపై ప్రభుత్వం ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.