ఆంధ్రప్రదేశ్‌లో 3 విమానాశ్రయాలకు కేంద్రం అనుమతి

ఆంధ్రప్రదేశ్‌లో మూడు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలకు కేంద్రం సూత్రప్రాయ అనుమతులు ఇచ్చింది.. అందులో కర్నూలు విమానాశ్రయం ఇప్పటికే ప్రారంభమైనట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి జనరల్‌ వీకే సింగ్‌ తెలిపారు. గురువారం లోక్‌సభలో వైసీపీ ఎంపీ  అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇప్పటివరకు భోగాపురం, ఓర్వకల్లు, దగదర్తి విమానాశ్రయాలకు అనుమతులు ఇచ్చామని, అందులో ఓర్వకల్లులో కార్యకలాపాలు 2021 మార్చిలోనే ప్రారంభమయ్యాయని తెలిపారు.  భోగాపురం విమానాశ్రయానికి రూ.2,500 కోట్లు, దగదర్తికి రూ.293 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశాం. విమానాశ్రయాల నిర్మాణం, నిధుల సేకరణ బాధ్యత అంతా వాటిని అభివృద్ధి చేసే వారిదేనని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా.. పీపీపీ/ జాయింట్‌ వెంచర్‌ విమానాశ్రయాల ద్వారా 2020-21 వరకు రూ.30,069 కోట్లు సంపాదించిందని ఆయన మరో ప్రశ్నకు బదులిచ్చారు. హైదరాబాద్, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా కన్సెషన్‌ ఫీజు రూపంలో 2020-21లో కేంద్రానికి రూ.856 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.