డీఆర్‌డీవో ‘ఆక్సీకేర్‌’ల కొనుగోలుకు కేంద్రం నిర్ణయం

దేశంలో మెడికల్‌ ఆక్సిజన్‌కు తీవ్ర కొరత నెలకొన్న నేపథ్యంలో డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఆక్సీకేర్‌ పరికరాలను లక్షన్నర కొనుగోలు చేయాలని కేంద్రప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. ఆక్సీకేర్‌ అనేది ఆక్సిజన్‌ సంతృప్తస్థాయి (ఎస్పీఓ2)పై ఆధారపడి పని చేస్తుంది. ఆక్సిజన్‌ను సరఫరా చేసి.. పేషంట్‌ విషమపరిస్థితికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. సాధారణరకం ఆక్సీకేర్‌లో 10 లీటర్ల ఆక్సిజన్‌ సిలిండర్‌, ప్రెషర్‌ రెగ్యులేటర్‌, హ్యుమిడిఫయర్‌, నాజల్‌ కాన్యులా ఉంటాయి. దీంట్లో ఎస్పీఓ2 రీడింగ్‌ ఆధారంగా ఆక్సిజన్‌ను మనం స్వయంగా నియంత్రించవచ్చు. మరోరకం ఆక్సీకేర్‌ కూడా ఉంది. ఇది ఎలక్ట్రానిక్‌ కంట్రోల్స్‌తో ఆటోమేటిక్‌గా పని చేస్తుంది. మొదటిరకం వాటిని లక్ష, రెండోరకం వాటిని 50 వేలు కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనికయ్యే మొత్తం వ్యయం రూ.322.5 కోట్లు. ఈ మొత్తాన్ని పీఎం కేర్‌ నిధుల నుంచి ఖర్చు చేయనున్నారు. వాస్తవానికి ఈ ఆక్సీకేర్‌ పరికరాలను ఎత్తైన ప్రదేశాల్లో విధులు నిర్వహించే సైనికుల కోసం రూపొందించారు. అయితే, మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు కేంద్రం వీటిని కొనుగోలు చేస్తున్నది. వీటిని భారీగా ఉత్పత్తి చేయటం కోసం పలు పరిశ్రమలకు డీఆర్‌డీఓ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా బదిలీ చేసింది.