గవర్నర్‌ను మార్చండి: రాష్ట్రపతి, ప్రధానికి మమత లేఖ

కోల్‌కతా: రాష్ట్రంలో “సుపరిపాలన” నిమిత్తం గవర్నర్‌ను వెంటనే మార్చాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నారద కుంభకోణంలో ఇద్దరు మంత్రులు, మాజీ మంత్రి, మాజీ మేయర్‌తో పాటు నలుగురు తృణమూల్ నాయకులను సీబీఐ సోమవారం అరెస్టు చేసిన వెంటనే మమత ఈ లేఖ రాసింది.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత గవర్నర్ జగదీప్ ధంఖర్.. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసాధారణమైన రీతిలో దాడికి పాల్పడుతున్నారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలను అదుపులో ఉంచకపోతే తీవ్ర చర్యలు తప్పవంటూ మమతను హెచ్చరించారు. రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడు పూర్తి నియంత్రణలో ఉన్నదని, అధికారులు పూర్తిగా కరోనా నిరోధనలో బిజీగా ఉన్నారని లేఖలో తెలిపిన మమత.. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాంతి, భద్రతల సమస్యను లేవనెత్తడం, దాని గురించి పబ్లిక్ డొమైన్‌లో ట్వీట్ చేయడం ద్వారా ధంఖర్ అన్ని పరిమితులను దాటుతున్నారని ఆరోపించారు. గవర్నర్ ప్రభుత్వ పనితీరును అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రంలో సుపరిపాలన అందించాలంటే వెంటనే గవర్నర్‌ను మార్చాలని మమతా బెనర్జీ తన లేఖలో కోరారు.

ఇదిలాఉండగా, గవర్నర్‌ను తొలగించాలని కోరుతూ శాసనసభ తీర్మానాన్ని ఆమోదించడం గురించి పార్టీ పరిశీలిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.