కెప్టెన్‌తో చన్నీ భేటీ.. పంజాబ్‌లో కొత్త ఈక్వేషన్స్‌

పంజాబ్‌ రాజకీయాల్లో సమీకరణాలు మారుతుంటాయి. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లుగా పంజాబ్‌లో కాంగ్రెస్‌ రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటివరకు తన మనిషిగా భావించిన చరంజీత్‌ చన్నీ, ముఖ్యమంత్రిగా నియమితులవగానే తన మాట వినడం లేదనే అభిప్రాయం సిద్ధూలో వచ్చింది. తన మాటకు చన్నీ గౌరవం ఇవ్వలేదన్న కోపంతో ఏకంగా పీసీసీ చీఫ్‌ పదవికి రాజీనామా సమర్పించారు. పార్టీ పెద్దల సమక్షంలో చర్చించి కమిటీ వేసినప్పటికీ సిద్ధూ శాంతించకపోవడంతో.. చన్నీ మరో మార్గం ఎంచుకున్నారు. అదే నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజీనామా చేసిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌తో భేటీ కావడం పంజాబ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా తయారైంది.

సిద్ధూతో బెడిసిన తర్వాత పంథాను మార్చుకున్న చన్నీ, గురువారం కుటుంబసమేతంగా మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ను కలిశారు.భార్య, కుమారుడు, కోడలుతో కలిసి కెప్టెన్‌ వద్దకు చన్నీ వెళ్లారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన తర్వాత కెప్టెన్‌ను చన్నీ కలువడం ఇదే మొదటిసారి. అమరీందర్‌ను ముఖ్యమంత్రిగా తొలగించిన తర్వాత చన్నీని సీఎంగా ఎంపిక చేయగానే.. చన్నీని కెప్టెన్‌ భోజనానికి పిలిచి తన పెద్ద మనుసు చాటుకున్నాడు. అయితే, బిజీగా ఉన్నందున కెప్టెన్‌ ఆహ్వానాన్ని చన్నీ తిరస్కరించాడు. వీరి భేటీ సిస్వాన్‌లోని కెప్టెన్‌ ఫామ్‌ హౌస్‌లో జరిగింది. ఈ సమావేశం ఎజెండా వెల్లడికాలేదు.

అమరీందర్‌ సింగ్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన నలుగురు అసమ్మదీయుల్లో చన్నీ కూడా ఉండటం విశేషం. అయితే, సిద్ధూతో బెడిసిన అనంతరం శత్రువుకు శత్రువు మిత్రుడనే దాన్ని చన్నీ నిజం చేసి చూపుతున్నారు. పంజాబ్ రాజకీయాల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్ అనుభవం దృష్ట్యా కొత్త రాజకీయ వాటాలు బయటపడవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.