రాజకీయాల నేపథ్యంలోనే చరణ్ – శంకర్ సినిమా?

ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమా అనే టాక్ వినిపిస్తోందిగానీ, శంకర్ తెరకెక్కించిన సినిమాలన్నీ దాదాపు అలాంటివేనన్న విషయం ఎవరైనా ఒప్పుకోవలసిందే. భారీతనం .. భారీ తారాగణం శంకర్ సినిమాల ప్రధమ లక్షణం. ఆ తరువాత కాలంలో ఆయన బలమైన కథాకథనాలకు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా జతచేశాడు. దాంతో శంకర్ సినిమా కోసం ప్రపంచ దేశాలలోని తెలుగు వాళ్లంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. అలాంటి శంకర్ దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేయనుండటం విశేషం.

ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఏ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనేది అందరిలో కుతూహలాన్ని పెంచుతోంది. ఈ కథ రాజకీయాల నేపథ్యంలో నడవనున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే చరణ్ మాత్రం రాజకీయ నాయకుడిగా కనిపించడట. అయితే అవినీతి రాజకీయాలను అడ్డుకునే పౌరుడిగా కనిపిస్తాడా? పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగుకి వెళుతుందని అంటున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో థియేటర్లకు రావొచ్చునని చెప్పుకుంటున్నారు.