కొవాగ్జిన్‌ వద్దన్న చత్తీస్‌గఢ్‌…సందేహాలకు చెక్‌ పెడుతూ హర్షవర్థణ్‌ వివరణ

కరోనాను అంతమొందించేందుకు ప్రస్తుతం వినియోగంలో ఉన్న కొవాగ్జిన్‌పై చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న అనుమానాలపై కేంద్ర మంత్రి డా. హర్షవర్ధణ్‌ స్పష్టతనిచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టిఎస్‌ సింగ్‌ డియోకు లేఖ రాశారు. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ మూడవ దశ పరీక్షలు పూర్తికాకపోవడం, బాటిల్స్‌పై గడువు తేదీలు లేకపోవడం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ డియో ట్వీట్‌ చేయడంతో పాటు కేంద్రానికి ఓ లేఖ రాశారు. ఈ సమస్యలను పరిష్కరించేంత వరకు రాష్ట్రానికి కొవాగ్జిన్‌ సరఫరా నిలిపివేయాలంటూ కోరారు. చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం గతంలో కూడా కొవాగ్జిన్‌పై పలు అనుమానాలను వ్యక్తం చేసింది. దీంతో సందేహాలకు చెక్‌ పెడుతూ హర్షవర్ధణ్‌ వివరణాత్మక సమాధానమిచ్చారు. అదేవిధంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో అన్ని రాష్ట్రాల కన్నా చత్తీస్‌గఢ్‌ వెనుకబడి ఉందని..దీనిపై ఆందోళన చెందుతున్నామని అన్నారు. రాష్ట్రాలకు సరఫరా చేసే టీకాలన్నీ సురక్షితమైనవని, వ్యాధి నిరోధకమైనవని, వీటిని త్వరగా వినియోగించాలని సూచించారు. కోవాగ్జిన్‌ గడువు తేదీ సమాచారం గురించి మీ ఆందోళన నిరాధారమైనదని పేర్కొన్నారు. తొలి విడతలో భాగంగా రాష్ట్రంలోని ఆరోగ్య కార్యకర్తలకు 69.87 శాతం సాధించినప్పటికీ..ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లలో 9.55 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్‌ అందించినట్లు పేర్కొన్నారు. రెండు టీకాలు తగినంత అందుబాటులో ఉన్నందున వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత మెరుగుపర్చాలని సూచించారు.