దేశ‌చర‌త్ర‌లో నిలిచిపోనున్న చిల‌క‌లూరిపేట‌ ఉమ్మ‌డి మానిఫేస్టో మ‌హాస‌భ

  • ప్ర‌జ‌ల‌ను ప‌ట్టి పీడిస్తున్న వైసీసీ ప్ర‌భుత్వానికి చ‌ర‌మ‌గీతం పాడుదాం
  • నియంత పాల‌న నుంచి రాష్ట్రాన్ని ర‌క్షించుకుందాం
  • జన‌సేన‌ పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజీ

చిల‌క‌లూరిపేట‌: టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన ఉమ్మ‌డి మానిఫేస్టో మ‌హాస‌భ చ‌రిత్ర‌లో నిలిచిపోనుంద‌ని, ఈ స‌భ‌కు ప్ర‌ధాని మోడీ రావ‌డం చిల‌క‌లూరిపేట‌కే గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని జన‌సేన‌ పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజీ అన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడుతూ ఏపీకి మంచి చేసేందుకే టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు అని , రాష్ట్ర ప్రజలు తమకు సేవ చేసేందుకు కలిసిన మూడు పార్టీల పొత్తును ఆశీర్వదించ‌నున్నార‌ని వెల్ల‌డించారు. మార్చి 17వ తారీకున మూడు పార్టీల ఉమ్మ‌డి వేదిక‌కు చిల‌క‌లూరిపేట కేంద్రం కావ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌న్నారు. సభా ప్రాంగణ పర్యవేక్షణ భాధ్యతలు కూడా తనపై పెట్టినందుకు గాను జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు గారికి ధన్యవాదములు తెలియచేసారు. రాష్ట్రం గత ఐదేళ్లుగా అన్ని రంగాల్లో అథోగ‌తి పాలైంద‌ని, నియంతృత్వ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు వాక్ స్వంతత్ర్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం అంతా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందని రాష్ట్రంలో మాత్రం జగన్ అరాచక రాజ్యాంగం అమలవుతుందని ధ్వజమెత్తారు. ప్ర‌జా స్వామ్యంలో అధికారం ఒక‌రి సొత్తు కాద‌ని, త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల అకాంక్షాలకు అనుగుణంగా పాల‌న ఉండ‌బోతుంద‌ని వెల్ల‌డించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీసీ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్నో ర‌కాల ప్ర‌లోభాల‌కు, అస‌త్య ప్ర‌చారాల‌కు తెర‌తీసిందని, జ‌న‌సైనికుల ఆత్మ‌స్థైర్యం దెబ్బ‌తిసేలా త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్నార‌ని మండి ప‌డ్డారు. అన్నింటిని భ‌రించి నిలిచిన జ‌న‌సేనికుల‌కు, టీడీపీ, బీజేపీ నాయ‌కుల‌కు త్వ‌ర‌లోనే మంచిరోజులు రానున్నాయ‌ని పేర్కొన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో మౌలిక వసతులు కల్పన లో వైసిపి ప్రభుత్వం విఫలం ఐయ్యిందని,చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిత్యవసర వస్తువుల ధరలు పెంచి ప్రజలను పట్టి పీడిస్తున్న వైసిపి ప్రభుత్వానికి చరమగీతం పాడేవిధంగా ప్రజలను స‌మాయుత్తం చేయాలని కోరారు. మేధావులు, సంఘ సంస్కర్తలు ఏకతాటిపైకి వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణకై కలిసి వారితో నడవాలని కోరారు. చిల‌క‌లూరిపేట స‌భ‌కు రాష్ట్ర నలుమూలల నుంచి వ‌చ్చే మూడు పార్టీల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లకు జ‌న‌సేనికులు స్వచ్ఛందంగా వాలంటీర్ లను ఏర్పాటు చేసామని సభకు వచ్చే వారికి బాస‌ట‌గా నిల‌వాల‌ని, స‌భ విజ‌య‌వంతానికి శ‌క్తివంచ‌న‌లేకుండా కృషి చేయాల‌ని కోరారు.