నూతన సరిహద్దు చట్టానికి చైనా ఆమోదం

సరిహద్దుకు సంబంధించిన కొత్త చట్టానికి చైనా నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌పిసి) ఆమోదం తెలిపింది. శనివారం జరిగిన లెజిస్లేటివ్‌ ముగింపు సెషన్‌లో ఎన్‌పిసి స్టాండింగ్‌ కమిటీ సభ్యులు ఈ చట్టాన్ని ఆమోదించినట్లు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ఈ చట్టం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుందని తెలిపింది. దేశ సరిహద్దు ప్రాంతాలు ఆక్రమణకు గురికాకుండా కాపాడుకునేందుకు ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొంది. దేశ సార్వభౌమత్వాన్ని, భూభాగాన్ని కాపాడుకోవడంతో పాటు చైనా ప్రాదేశిక వాదనలకు విఘాతం కలిగించేందుకు ఇతరులు చేసే ప్రయత్నాలను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, సైన్యానికి ఈ చట్టం చెబుతోంది. అదేవిధంగా సరిహద్దుల్లో రక్షణను పటిష్టపరచాలని, సాంఘిక, ఆర్థికాభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇరుగుపొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపింది. గతేడాది భారత్‌, చైనా మధ్య వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ఈ చట్టాన్ని ప్రతిపాదించారు.