చీపురుపల్లి నియోజకవర్గ అభివృద్ధిని తుంగలో తొక్కిన బొత్స సత్యనారాయణ: రేగిడి

చీపురుపల్లి నియోజకవర్గం అభివృద్ధిని బొత్స సత్యనారాయణ తుంగలో తొక్కారని విజయనగరం జనసేన నాయకులు రేగిడి లక్ష్మణరావు ఎద్దేవా చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీపురుపల్లి నియోజకవర్గం నుండి మూడుసార్లు మినిస్టర్ గా ఎన్నుకోబడిన బొత్స సత్యనారాయణ గారు చీపురుపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి ఎటువంటి పనులు చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు ఆయనకు పట్టవు. తాగునీటి సమస్య ప్రధాన సమస్యగా చెప్పవచ్చు అప్పుడప్పుడు చట్టం చూపుల చుట్టంలా వచ్చి నియోజకవర్గంలో కనిపించి, కనిపించినట్టుగా కార్యకర్తలతో సమావేశమై వెళ్లిపోవడం తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ సమస్యలను ఏరోజు కూడా తన బాధ్యతగా వ్యవహరించలేదని రేగిడి లక్ష్మణరావు ఎద్దేవా చేశారు, విజయనగరం జిల్లా అంతా మీ గుప్పట్లో పెట్టుకున్న మీరు కానీ, చిన్న శ్రీను గానీ విజయనగరం జిల్లాని గాని, చీపురుపల్లి నియోజకవర్గాన్ని గానీ ఏ రకంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారో బహిరంగంగా చర్చకి రావాలని డిమాండ్ చేశారు. మెరకముడిదాం మండల జడ్పిటిసిగా ఏక గ్రీవంగా గెలిచి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నుకోబడిన చిన్న శ్రీను ఈ రోజు మెరకముడిదాన్నే గాలికి వదిలేసారు. ఎన్నో సంవత్సరాలగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన స్మశాన వాటిక స్థలం కేటాయించాలని, ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా దీనిపై స్పందించక పోవడానికి గల కారణం ఏమిటో చిన్న శ్రీను గారు సమధానం చెప్పాలి. దళితులు అంటే అంత చిన్న చూపా మీకు, మా సమస్యకు పరిష్కారం చూపించకపోతే ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తానని తెలియజేస్తున్నాం. 2024 ఎలక్షన్లో కచ్చితంగా బొత్స సత్యనారాయణ గారిని ఓడించడానికి అలాగే చిన్న శ్రీను గారి యొక్క ఓటమికి మేము పని చేస్తామని రేగిడి లక్ష్మణరావు హెచ్చరించారు.