నేడు దిల్లీకి సీఎం జగన్… రాత్రి 9 గంటలకు అమిత్ షా తో బేటీ

ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ టూర్ కి రెడీ అవుతున్నారు సీఎం వైఎస్ జగన్. ఈ పర్యటనలో రాష్ట్ర హోంశాఖ మంత్రి తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీకి ముహూర్తం కూడా ఖరారు అయినట్లు, ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకి ఆయన జగన్ కి అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ భేటీలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు సహకరించాలని కేంద్రాన్ని సీఎం కోరే అవకాశం ఉంది. హైకోర్టును కర్నూలుకు తరలించే‌ ప్రక్రియ ఆరంభించాలని మరోమారు అమిత్ షాను కోరనున్నట్లు తెలిసింది.

ఉగాది నాటికి విశాఖకు కార్యనిర్వాహక రాజధానిని తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పటిలోపు న్యాయస్థానాల్లోనూ విచారణ పూర్తవుతుందని అంచనా వేస్తోంది. ఈ లోపు కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకోవడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. అలాగే విభజన చట్టంలోని పలు అంశాల పరిష్కారం, పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులపై హోం మంత్రితో ముఖ్యమంత్రి చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో మాట్లాడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.