తాడిపత్రిలో 500 ఆక్సిజన్ పడకల కొవిడ్‌ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్‌..

కొవిడ్ నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తాత్కాలిక కొవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే అనంతపురంలో 300 పడకలతో జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో నెలకొల్పిన కోవిడ్ ఆసుపత్రిని జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు.

ఇదిలా ఉంటే తాజాగా రాష్టంలోనే తొలిసారి భారీ ఎత్తున 500 ఆక్సిజన్ పడకల జర్మన్ హ్యంగర్ల ఆసుపత్రిని అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఆర్జాస్ స్టీల్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిని సీఎం జగన్ మోహన్ రెడ్డి కాసేపటి క్రితమే ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో సీఎం ఆసుత్రిని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఆసుపత్రి నిర్మాణానికి రెండు నెలల గడువున్నప్పటికీ కేవలం 14 రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. ఇక ఈ ఆసుపత్రిలో ప్రతీ బెడ్‌కు ఆక్సిజన్ సరఫరా ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిని తాడిపత్రి శివారులోని అర్జా స్టీల్ ప్లాంట్ సమీపంలో నిర్మించారు. సుమారు రూ. 5.50 కోట్ల వ్యయంతో 13.56 ఎకరాల్లో ఈ ఆసుపత్రిని నిర్మించారు. అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల ప్రజలకు అనువుగా ఉండేలా తాడిపత్రి లో కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు.

ఇక తాడిపత్రికి సమీపంలోని స్టీల్‌ప్లాంట్ నుంచి లిక్విడ్ ఆక్సిజన్‌ను ఈ తాత్కాలిక ఆసుపత్రికి తరలిస్తారు. పైపుల ద్వారా తరలించే ఆక్సిజన్‌ను కొవిడ్ బాధితులకు ఉపయోగిస్తారు. ఇదిలా ఉంటే స్టీల్‌ప్లాంట్ నుంచి ఆసుపత్రికి ఆక్సిజన్ తరలించేందుకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పైపులతో పాటు.. ఫ్లోమీటర్లను మేఘ ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) సంస్థ ఏర్పాటు చేసింది.