కిరణ్ రాయల్ కుటుంబానికి ధైర్యమిచ్చిన ప్రతి ఒక్కరికీ అభినందనలు

జనసేన పార్టీలో ప్రతి కార్యకర్త, నాయకుడూ ఒక కుటుంబంలా కలసిపోవడం వల్లే ఎవరికి ఏ ఇబ్బంది ఎదురైనా మేమున్నాం అని అండగా నిలుస్తున్నారని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో కొనియాడారు. ఈ సమైక్యత వల్లే పాలక పక్ష అప్రజాస్వామిక వైఖరిని బలంగా ఎదుర్కోగలుగుతున్నాం. జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ కిరణ్ రాయల్ మీద అక్రమ కేసు నమోదు చేసి, దౌర్జన్య ధోరణిలో ఆయన కుటుంబ సభ్యులను బంధించి, అరెస్టు చేసిన విధానాన్ని రాజ్యాంగ విలువలను విశ్వసించే ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. శుక్రవారం రాత్రి శ్రీ కిరణ్ రాయల్ ను అక్రమంగా అరెస్టు చేశారని తెలియగానే వారి కుటుంబానికి ధైర్యం చెబుతూ… ఆయన తరఫున ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులు, పార్టీ లీగల్ సెల్ సభ్యులు న్యాయపోరాటం సాగించారు. జిల్లా అధ్యక్షులు డా.పి.హరిప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు శ్రీ జి.రాందాస్ చౌదరి, శ్రీమతి వినుత, జె.రాజారెడ్డి, శ్రీమతి ఆరణి కవిత, శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, శ్రీమతి కీర్తన, శ్రీమతి వనజ ఎప్పటికప్పుడు పార్టీ లీగల్ సెల్ సభ్యులను సమన్వయపరచుకొంటూ, కిరణ్ కుటుంబానికి అండగా ఉన్నారు. పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ ఈవన సాంబశివ ప్రతాప్ సూచనలు సలహాలతో న్యాయవాదులు శ్రీమతి శ్యామల, ముక్కు సత్యవంతుడు, శ్రీహరి, మోహన్ రావు, అమరనారాయణ, భార్గవ్, నారాయణలు పకడ్బందీగా వాదించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నాయకులు నగరికి చేరుకొని శ్రీ కిరణ్ రాయల్ పక్షాన నిలబడ్డారు. వీరందరికీ అభినందనలు. ఈ విధంగా మనో ధైర్యాన్ని ఇవ్వడం వల్ల ప్రజల కోసం నిలబడే నాయకులు, శ్రేణులు మరింత బలంగా క్షేత్ర స్థాయిలో పని చేయగలుగుతారు. అక్రమ కేసును ఎదుర్కొనేందుకు కిరణ్ రాయల్ కుటుంబం ధైర్యంగా సన్నద్ధం కావడం అభినందనీయం. ఆయన కుటుంబానికి పార్టీ భరోసాగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.