విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తపిస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు

గత మూడు రోజులుగా లక్షల సంఖ్యలో ట్వీట్స్ చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. ఈ డిజిటల్ క్యాంపెయిన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. #Raise_Placards_ANDHRA_MP, #SaveVizagSteelPlant, Raise_Placards_YSRCP_MP హ్యాష్ ట్యాగ్ లతో చేసిన

ఈ క్యాంపెయిన్ 697.4 మిలియన్ల మందికి రీచ్ అయిందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలనే ఉక్కు సంకల్పంతో ప్రజలు ఉన్నారని అర్ధం అవుతోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం తెలుగువారందరినీ భావోద్వేగంతో ఏకం చేసి పోరాడేలా చేసింది. విశాఖ ఉక్కు కర్మాగారం సాధించేలా చేసింది. ఆ నినాదాన్ని మన రాష్ట్ర ఎంపీలు అందరికీ మరోమారు గుర్తు చేస్తూ వారికి బాధ్యతను తెలియచెప్పేలా సామాజిక మాధ్యమాల్లో అన్ని వర్గాల ప్రజలు ఒక ఉద్యమ స్ఫూర్తితో పోస్టులు చేశారు. జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. శనివారం నుంచి నేటి వరకూ మూడు రోజులపాటు ట్విటర్ వేదికగా మన రాష్ట్రం నుంచి పార్లమెంట్ కు వెళ్ళిన ప్రతి లోక్ సభ, రాజ్య సభ సభ్యుడినీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా ప్లకార్డులు ప్రదర్శించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబాలు, విశాఖ ఉక్కు కోసం పోరాడినవారు ట్విటర్ ద్వారా మన ఎంపీలకు బాధ్యతను గుర్తు చేశారు. పెళ్లి పందిళ్ళల్లో కూడా వధూవరులు, అతిధులు సైతం విశాఖ ఉక్కును కాపాడుకోవాలని కోరుకొంటూ ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తులు చేయడం చూస్తుంటే ప్రజల్లో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఎంతగా తపిస్తున్నారో అర్థం అవుతోంది. జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. ప్రజల్లో విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ కారాదనే భావన ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. ఈ స్ఫూర్తి మన రాష్ట్ర ఎంపీల్లో
కూడా రావాలని అందరం కోరుకుందాం అని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.