జెఫ్ బెజోస్ కు శుభాభినందనలు: సుందర్ పిచాయ్!

ప్రపంచ అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడిగా, అత్యంత కుబేరుడిగా ఉన్న జెఫ్ బెజోస్, తాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించడంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, జెఫ్ బెజోస్ కు శుభాభినందనలు తెలిపారు. ఇదే సమయంలో జెఫ్ ప్రారంభించిన రెండు కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. “కంగ్రాట్స్ జెఫ్ బెజోస్… ‘డే వన్’ మరియు ‘ఎర్త్ ఫండ్’ కార్యక్రమాలు విజయవంతం కావాలి. కొత్త బాధ్యతలు స్వీకరించనున్న ఆండీ జెస్సీకి కూడా అభినందనలు” అని అన్నారు.

కాగా, జెఫ్ బెజోస్ ఈ సంవత్సరం తన బాధ్యతల నుంచి తప్పుకోనుండగా, ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్ అధిపతిగా ఉన్న ఆండీ జెస్సీ కొత్త సీఈఓ బాధ్యతలను చేపట్టనున్నారు. సెప్టెంబర్ తరువాత తన బాధ్యతలను ఆండీ జెస్సీకి అప్పగించనున్నట్టు జెఫ్ బెజోస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అమెజాన్ ఉద్యోగులకు ఓ లేఖను రాసిన బెజోస్, సీఈఓగా తాను తప్పుకున్నా, అమెజాన్ ముఖ్యమైన విధుల్లో కొనసాగుతానని, సంస్థను మరింత ఉన్నత స్థితికి తీసుకుని వెళ్లడమే తన లక్ష్యమని వెల్లడించారు. ఇదే సమయంలో పేదల సంక్షేమానికి తోడ్పడేందుకు ఔదార్య కార్యక్రమాలను ప్రారంభిస్తున్నానని కూడా ఆయన తెలిపారు.ఇందుకోసం నిధుల సమీకరణ అతి త్వరలోనే ప్రారంభిస్తున్నట్టు కూడా తెలిపారు.

అంతరిక్ష పరిశోధనలు, జర్నలిజంపై ఆది నుంచి ఆసక్తిని చూపే జెఫ్ బెజోస్, ఆ దిశగా అడుగులు వేస్తారని, తాను సమీకరించే నిధులతో వెంచర్ స్పేస్ ఎక్స్ ప్లోరేషన్ ఫండ్ ను ప్రారంభించి, స్పేస్ సీక్రెట్స్ ను కనుగొనే సంస్థలకు సాయం చేస్తారని తెలుస్తోంది.