అమిత్ షా తో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటి.. బీజేపీలో చేరేందుకు సిద్ధం

అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలకు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నది. బీజేపీ ప్రయత్నాలు కొంత మేరకు ఫలించిన క్రమంలో అస్సాంకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారని అస్సాం బీజేపీ అధ్యక్షుడు రంజిత్ కుమార్ దాస్ అన్నారు. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు తాము సానుకూలంగా ఉన్నట్లు అమిత్ షాకు స్పష్టం చేసినట్లు ఆయన వెల్లడించారు. కేవలం వాళ్లు మాత్రమే కాకుండా వారితో పాటు ఒక కోర్ కమిటీ ఉందని, వారందరినీ కూడా డిసెంబర్ 30లోపు బీజేపీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమిత్ షాకు తెలిపినట్లు రంజిత్ పేర్కొన్నారు.

మొత్తం 126 స్థానాలు ఉన్న అస్సాం అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం అస్సాం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ. అయితే బీజేపీ నేత చెప్పినట్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు బీజేపీలో చేరితే కాంగ్రెస్ స్థానాన్ని ఏఐయూడీఎఫ్ ఆక్రమిస్తుంది. 14 స్థానాలతో ఉన్న ఆ పార్టీ.. ప్రస్తుతం కాంగ్రెస్ తర్వాత ద్వితియ ప్రతిపక్షంగా ఉంది.