నిరుద్యోగులకు పోలీసుల జాబ్‌ కనెక్ట్‌

తెలంగాణ ఆవిర్భావం తర్వాత పోలీసు శాఖలో వినూత్న మార్పులు చేటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. జాబ్‌ కనెక్ట్‌ పేరుతో నగరంలోని యువతీయవకులకు ఉద్యోగాలను కల్పిస్తూ వారి ఉపాధికి బాటలు వేస్తున్నారు. మినీ భారత్‌గా మారిన హైదరాబాద్‌ నగర జనజీవనంతో మమేకమవుతూ యువతను సన్మార్గంలో నడిపించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. జాబ్‌ కనెక్టివిటీ మొబైల్‌ వాహనంతో నగరంలోని అన్ని ప్రాంతాల్లో నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారికి ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. టీఎంఐ కంపెనీ సౌజన్యంతో నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లతో పాటు అన్ని ప్రాంతాల్లో ఈ మొబైల్‌ వాహనం క్యాంప్‌లు నిర్వహిస్తున్నది. ఆయా క్యాంప్‌ల్లో స్వీకరించిన దరఖాస్తులకు పరిష్కారం చూపేందుకు నగరంలో మెగా జాబ్‌మేళాలు నిర్వహించి ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు. టీఎంఐ కంపెనీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 70 వేలమంది నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని కంపెనీ ప్రతినిధి కేశవ్‌ తెలిపారు. గురువారం యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌ ప్రాంతంలో సిబ్బంది రాజునాయక్‌తో కలిసి జాబ్‌ కనెక్టివిటీ మొబైల్‌ వాహనంలో నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆయా ఉద్యోగాల భర్తీకి శనివారం నాంపల్లి అన్వరులూం కాలేజీలో మెగా జాబ్‌మేళా ఏర్పాటు చేయనున్నట్లు కేశవ్‌ తెలిపారు.