కొత్త సచివాలయంలో మందిరం, మసీదులతో పాటూ చర్చ్ నిర్మాణం

పాత సచివాలయం భవనాలను కూల్చుతున్న క్రమంలో మందిరం, మసీదులు దెబ్బతిన్న విషయం తెలిసిందే. వాటి స్థానంలో కొత్తగా గుడి, మసీదులను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే హామీ ఇచ్చారు. తాజాగా సీఏం వాటిపై స్పష్టతనిస్తూ శనివారం ప్రగతి భవన్‌లో ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలు, సూచనలు కేసీఆర్ తీసుకున్నారు. కొత్త సచివాలయంలో మందిరం, మసీదుతో పాటు చర్చి కూడా నిర్మించి.. గంగా జమున తహెజీబ్‌ను చాటుతామని వెల్లడించారు. కొత్తగా నిర్మించే సెక్రటేరియట్‌లో మందిరం, మసీదులు, చర్చిని పూర్తి ప్రభుత్వ ఖర్చుతో అన్ని సౌకర్యాలతో నిర్మిస్తామని కేసీఆర్‌ స్పష్టంచేశారు.

అసెంబ్లీ సమావేశాల అనంతరం ఒకే రోజు అన్నీ ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేస్తామని, త్వరితగతిన మందిరం, మసీదు, చర్చ్ నిర్మాణాలు పూర్తి చేస్తామని కేసీఆర్‌ తెలిపారు. ఇందులో అన్నీ వసతులు/ సౌకర్యాలు ఉంటాయని స్పష్టంచేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత గంగా జమునా తహజీబ్‌కు అద్దం పట్టేలా ఒకే రోజు ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఇస్లామిక్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

హైదరాబాద్ చుట్టూ ఖబ్రస్థాన్‌ రావాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం స్థలం సేకరించాలని రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లను ఆదేశించామని చెప్పారు. హైదరాబాద్‌లో వివిధ చోట్ల 200 ఎకరాల్లో ఖబ్రస్థాన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ముస్లిం అనాథ పిల్లలకు ఆశ్రయమిచ్చి, విద్య అందించే.. అనీస్- ఉల్-గుర్భా నిర్మాణం వేగవంతం చేస్తాం అని కేసీఆర్ హామీ ఇచ్చారు.