మహారాష్ట్రలో మళ్లీ కరోనా విజృంభణ

మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 4 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 40 మంది కరోనాతో మరణించారు. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారినపడిన వారి సంఖ్య 20,64,278కి చేరింది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 51,529కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 1,355 మంది రోగులు కరోనా నుండి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 19,75,603కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 35,965 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. కనీసం లక్షా 75 వేల మంది హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపింది. మరో 1747 మంది రాష్ట్ర క్వారెంటైన్‌లో ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ చెప్పింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.7 శాతంగా ఉంది. ఇక ఆ రాష్ట్రంలో మరణాల రేటు 2.5 శాతంగా రికార్డు అయ్యింది. ఆదివారం ఒక్క రోజే 48,782 మందికి పరీక్షలు చేపట్టారు. ఆదివారం నాడు ముంబయిలో 645 కేసులు నమోదవగా, నలుగురు మరణించారు.

నాసిక్‌లో కొత్తగా 122 కేసులు, పుణెలో 353, చించ్‌వాడ లో 138 కేసులు నమోదు అయ్యాయి. ఔరంగబాద్‌, హింగోలీలో మాత్రం కొత్త కేసులు నమోదు కాలేదు. కొల్హాపూర్‌లోని రత్నగిరి డివిజన్‌లో ఒకరు మరణించారు. అమరావతి నగరంలో 430 కొత్త కేసులు నమోదు అయ్యాయి.