మహారాష్ట్రలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆ రాష్ట్ర సర్కారు ఇప్పటికే చాలా చోట్ల లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చింది. దీంతో జనం గుంపులు కడుతున్నారు. కరోనా ముప్పుందని తెలిసినా.. నిబంధనలను పట్టించుకోవడం లేదు. దీంతో రెండ్రోజులుగా తగ్గిన కరోనా కేసులు తాజాగా మళ్లీ ఎక్కువయ్యాయి. పది వేల మార్కును దాటాయి.

బుధవారం కొత్తగా 10,107 మంది మహమ్మారి బారిన పడ్డారు. అంతకుముందు రోజు 7,652 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అంటే ఒక్కరోజులోనే 2,500 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ముంబై మహా నగరంలో 821 కేసులు నమోదవగా.. అంతకుముందు రోజుతో పోలిస్తే కేసులు 50 శాతం వరకు పెరిగాయి. గత 11 రోజుల్లో నగరంలో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

అయితే, మరణాలు తగ్గడం కొంచెం ఊరట కలిగించే విషయం. బుధవారం మరో 237 మంది మహమ్మారికి బలవ్వగా.. అంతకుముందు రోజు 388 మంది మరణించారు. తాజాగా మరణాల గణాంకాలను సవరించిన మహారాష్ట్ర సర్కారు.. 999 మరణాలను జాబితాలో చేర్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాలు 1.15 లక్షలకు పెరిగాయి. కాగా, ఇప్పటిదాకా 45 శాతం మందికి కనీసం ఒక్క డోసైనా టీకా వేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.