తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

తెలంగాణలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న తీరును చూస్తుంటే రాష్ట్రంలో సెకండ్ వేవ్ ప్రారంభమైందని చెప్పవచ్చని అన్నారు.

కరోనా కట్టడికి గత ఏడాది ఎలాంటి చర్యలను చేపట్టామో… మళ్లీ అలాంటి చర్యలనే ప్రారంభించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజల మద్దతు కావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులను ధరించాలని సూచించారు. వ్యాక్సిన్ కు అర్హులైన ప్రతి ఒక్కరూ దాన్ని తీసుకోవాలని చెప్పారు. టీకా వల్ల కరోనా తీవ్రత ఎక్కువ కాకుండా చూడొచ్చని అన్నారు.

మరోవైపు తెలంగాణలోని గురుకులాలు, స్కూళ్లు, హాస్టళ్లలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై శ్రీనివాసరావు స్పందిస్తూ, స్కూళ్లలో కరోనా కేసులు వస్తుండటంతో… మళ్లీ లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ పెడతారనే ప్రచారం జరుగుతోందని.. అయితే, అలాంటి ప్రపోజల్ ఇంత వరకు పెట్టలేదని చెప్పారు. విద్యా సంస్థల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని… విద్యార్థుల వల్ల ఇంట్లో ఉన్న వృద్ధులకు, దీర్థకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రమాదం పొంచి ఉందని అన్నారు.