అమెరికాలోనూ కరోనా స్ట్రెయిన్

ప్రపంచవ్యాప్తంగా కొత్త కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతోంది. యూకేలో పుట్టిన కొత్త స్ట్రెయిన్ ఇతర దేశాలకూ విస్తరిస్తోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలోకి ప్రవేశించింది. కొలరాడో రాష్ట్రంలో తొలి కేసు నమోదైనట్లు గవర్నర్‌ జేర్డ్‌ పొలిస్‌ ప్రకటించారు. డెన్వర్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడికి ఈ కొత్త రకం వైరస్ సోకినట్లు గుర్తించారు. అయితే ఇటీవల అతను ఎక్కడికి ప్రయాణించిందీ లేదని అధికారులు తెలిపారు. దీన్ని అమెరికా ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ పరిగణనలోకి తీసుకుంది. వైరస్‌ సోకిన వ్యక్తితో ఇటీవల కలిసిన వారిని వెతికే పనిలో పడింది. ఇప్పటికే పాతరకం కరోనాతో అమెరికా అతలాకుతలమవుతున్న విషయం తెలిసిందే. క్రిస్మస్‌, కొత్త సంవత్సర సెలవుల తర్వాత ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ తరుణంలో కొత్త రకం వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ కొత్త వైరస్‌ గురించి ఇంకా తెలియాల్సింది చాలా ఉందని జేర్డ్‌ పొలిస్‌ తెలిపారు. వేగంగా వ్యాపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారని గుర్తుచేశారు. కొలరాడో ప్రజల ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. తాజాగా వెలుగులోకి వచ్చిన కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి.. వ్యాప్తిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త వైరస్‌ వెలుగులోకి వచ్చిన వెంటనే అప్రమత్తమైన అమెరికా.. యూకే నుంచి అమెరికాకు వచ్చేవారు తప్పనిసరిగా కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రం చూపాల్సిందేనని షరతు విధించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *