ఏపీలో కరోనా కలకలం.. ఒకే స్కూల్ లో 55 విద్యార్థులకు పాజిటివ్‌ !

ఏపీలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మొన్నటి వరకు తగ్గిన కేసులు.. గత పదిరోజులుగా భారీగా పెరుగుతున్నాయి. అటు ఏపీలోని స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలోని ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో ఏకంగా 55 మంది విద్యార్థులకు, ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు, సాధారణ పరిస్థితులు వచ్చేవరకూ స్కూలును మూసివేసి, ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. కాగా..ఏపీలో గత 24 గంటల్లో 31,142 సాంపిల్స్ పరీక్షించగా.. 1005 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గతేడాది నవంబర్ 26 తర్వాత వేయి కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక గత 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. ఇదే సమయంలో 324 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు.. దీంతో.. ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,98,815కు చేరుకోగా.. కోలుకున్నవారి సంఖ్య 8,86,216కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 5394 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 7,205 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక, ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 1,49,90,039 సాంపిల్స్ ని పరీక్షించినట్టు కరోనా బులెటిన్‌లో పేర్కొంది ఏపీ సర్కార్.