తెలంగాణలో మే 31 వరకు రెండో డోసు వారికి మాత్రమే కరోనా టీకా!

తెలంగాణలో కరోనా టీకా రెండో డోసు వారికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ల కొరత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో దీన్ని 31 వరకు కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ఇంకా 15 లక్షల మంది రెండో డోసు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. వీరంతా పూర్తయిన తర్వాత మిగతా వారికి విడతల వారీగా టీకాలు అందజేస్తామని స్పష్టం చేశారు.

ఇక రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో బెడ్ల కొరత లేదని శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,738 ఆక్సిజన్‌ బెడ్లు, 17,267 ఐసీయూ బెడ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాలకు ఎలాంటి కొరత లేదని పేర్కొన్నారు. మరో ప్రత్యామ్నాయం లేకే రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతించినట్లుగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని సూచించారు. అయితే, ఆ సమయంలోనూ కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెప్పారు.