సెప్టెంబరుకల్లా కరోనాకు సరైన చికిత్స: డాక్టర్ ఆంటోనీ ఫౌచీ

సెప్టెంబరుకల్లా కరోనాకు చికిత్స వస్తుందని అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆశాభావం వ్యక్తం చేశారు. వైరస్‌ నుంచి కోలుకున్న వారి శరీరాల నుంచి సేకరించిన యాంటీబాడీల ద్వారా కరోనాను ఎదుర్కొనేందుకు ‘కచ్చితమైన తూటాలు’ అభివృద్ధి చేయవచ్చని ఆయన తెలిపారు. ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకెర్‌బర్గ్‌తో లైవ్‌లో జరిగిన ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ సందర్భంగా ఫౌచీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మోనోక్లోనల్‌ యాంటీబాడీలపై చేస్తున్న ప్రయోగాల ఫలితాలు సెప్టెంబరు నాటికి వస్తాయని అంచనా వేస్తున్నాం. కచ్చితమైన తూటాల్లాంటి వీటిని నరాలకు ఎక్కించి శరీరంలోకి పంపవచ్చు. వివిధ దశల్లో ఉన్న రోగులను ఈ యాంటీబాడీల సహాయంతో వైరస్‌ నుంచి రక్షించవచ్చని భావిస్తున్నాం. కరోనా తీవ్ర లక్షణాలున్న వ్యక్తి.. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా చేసే ఔషధాలు మనకిప్పుడు అవసరం. అజాగ్రత్త కారణంగా ఎక్కువగా యువతే వైరస్‌ బారిన పడుతున్నారు. జాగ్రత్తలు పాటించడం వారి వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు. అది వారికి ఉండాల్సిన సామాజిక బాధ్యత కూడా’’ అన్నారు.