అధికారంలోకి వచ్చాక సీపీఎస్ రద్దు చేస్తాం

* ఇది జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంలో ఓ విధానం
* వైసీపీ ప్రభుత్వంలో పీఆర్సీ మోసం, సీపీఎస్ ద్రోహంతో ప్రభుత్వ ఉద్యోగులు అల్లాడుతున్నారు
* నెలనెలా జీతం ఇవ్వాలంటే ప్రభుత్వానికి అప్పులే మార్గం
* సమయానికి జీతం పడక ఉద్యోగులకు అగచాట్లు
* పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ కష్టాలన్నీ తీరుతాయి
* పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 29వ రోజున మైపాడు రోడ్డు ప్రాంతంలోని శ్రీనివాసనగర్ 5, 6 వీధులలో జరిగింది. ఈ ప్రాంతంలోని ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు పాదయాత్రలో దారి పొడుగునా ప్రతి ఊరిలో సీపీఎస్ రద్దు చేస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చిన నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆ హామీని తుంగలో తొక్కి ఉద్యోగులకు తీరని అన్యాయం చేశారన్నారు. ఎన్నికల ముందు గుర్తురాని సాంకేతిక అంశాలు, అధికారంలోకి రాగానే గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అంశంలో కూడా తీరని అన్యాయం చేశారని కేతంరెడ్డి విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే ప్రతినెలా అప్పులే మార్గంగా మారాయని ఎద్దేవా చేశారు. సమయానికి జీతాలు పడక ప్రభుత్వ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పర్సనల్ లోన్, గృహ లోన్ వంటి వాటికి ఈఎంఐలు కూడా క్రమం తప్పడంతో ఉద్యోగులు వేదన అనుభవిస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులు బోనస్, ఇంక్రిమెంట్లు వంటి వాటిని మరిచిపోయారని, కనీసం జీతమైనా నెలకు సక్రమంగా పడితే చాలు అనే స్థితికి ఉద్యోగులు వచ్చేలా ఈ ప్రభుత్వం తయారు చేసిందని విమర్శించారు. రానున్నది జనసేన పార్టీ ప్రభుత్వమేనని, పవన్ కళ్యాణ్ గారు అందరినీ కలుపుకొని ఖచ్చితంగా ముఖ్యమంత్రి కాబోతున్నారని, పవనన్న ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇలాంటి కష్టాలు ఉండవని కేతంరెడ్డి తెలిపారు. సీపీఎస్ రద్దు గురించి అన్ని పార్టీలు కూడా మీనమేషాలు లెక్కిస్తున్నా కూడా ధైర్యంగా తమ షణ్ముఖ వ్యూహంలో ప్రకటించిన పార్టీ ఒక్క జనసేన పార్టీ మాత్రమే అని కేతంరెడ్డి గుర్తు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ పవన్ కళ్యాణ్ కి అండగా నిలవాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.