ఉక్రెయిన్ లోకుప్పకూలిన మిలటరీ విమానం

ఉక్రెయిన్ లో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8.50 నిమిషాల సమయంలో ఉక్రెయిన్ వైమానిక దళానికి చెందిన మిలిటరీ విమానం కుప్పకూలడంతో 25 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. ఖర్ కీవ్ అనే ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. విమానం లో మొత్తం 28 మంది ఉన్నారని. ప్రమాదంలో 25మంది మృతి చెందినట్లు ఆ దేశ రక్షణ శాఖ డిప్యూటీ మంత్రి అంటన్ గెరాశ్చెంకా తెలిపారు. విమానంలో ఉన్నవారిలో 21 మంది శిక్షణ పొందుతున్న సైనికులు ఉన్నారు. మిగతా ఏడుగురు క్రూ సిబ్బంది ఉన్నారు. విమానం ప్రమాదానికి కురవడానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని మంత్రి తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమియర్ జెలెన్ స్కీ ప్రమాదంపై ఫేస్ బుక్ ద్వారా స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందు కోసం తక్షణ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఉక్రెయిన్ మిలట్రీ దళానికి చెందిన అంటోనోవ్-26 విమానం చూహయివ్ ఆర్మీ క్యాంపు కు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ దుర్ఘటన జరిగింది. విమానం కూలగానే భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. అయితే ఈ దుర్ఘటన రష్యా అనుకూల వేర్పాటు వాదులు ఉండే ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం తో వారికి ఈ ప్రమాదానికి ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తి ఫెయిలవ్వడం వల్ల ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని ప్రాసిక్యూటర్ జనరల్ చెప్పారు. ప్రమాదంలో 30 ఏళ్ల ఎయిర్ క్రాఫ్ట్ కమాండర్ కూడా ప్రాణాలు విడిచాడు.