ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ విజేత రజనీకాంత్

భారత సినీ రంగంలో అత్యున్నత అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే. తాజాగా 51వ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కేంద్రం దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రకటించింది. ఈ సందర్భంగా తనను ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించడం పట్ల రజనీకాంత్ హర్షం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు జ్యూరీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన సినీ ప్రస్థానంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఈ ఘనతర అవార్డును అంకితం ఇస్తున్నానని రజనీ ప్రకటించారు. అలాగే ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.

కాగా, రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం దక్కడంపై ఆయన ప్రాణమిత్రుడు మోహన్ బాబు స్పందించారు. “నా మిత్రుడు రజనీకాంత్ కు దాదాసాహెబ్ అవార్డు వచ్చింది. అదీ నా స్నేహితుడంటే! మరెన్నో ఘనతలకు రజనీ అర్హుడు. ఈ క్షణాన నిజంగా గర్విస్తున్నాను” అని పేర్కొన్నారు.

ఇక, రజనీకి అత్యున్నత పురస్కారం ప్రకటించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వెలిబుచ్చారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు రజనీ నిజంగా అర్హుడేనని కొనియాడారు. “సినీ పరిశ్రమకు నీవు అందించిన సేవలు అపారం మిత్రమా. నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. దేవుడు నీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను” అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ కూడా రజనీకాంత్ కు అభినందనలు తెలిపారు. “సినీ రంగానికి మీరందించిన సేవలు అసమానం రజనీ సర్” అంటూ కితాబునిచ్చారు. మీ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం అని కీర్తించారు.