రాజధానిపై ఇక నుంచి రోజువారీ విచారణ

రాజధాని అమరావతి అంశంపై నేటి నుంచి హైకోర్టులో విచారణ జరగనుంది. తొలుత రాజధాని అంశంపై దాఖలైన అనుబంధ పిటీషన్లపై నేడు విచారణ చేపట్టనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. అనంతరం ప్రధాన పిటీషన్లపై విచారణ జరపనుంది.

అయితే, ఎపిలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ బిల్లులను గవర్నర్‌ కూడా ఆమోదించారు. కానీ, గవర్నర్‌ ఆమోదించిన బిల్లులు రాజ్యాంగబద్ధంగా లేవంటూ… హైకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. దీంతో వాటిపై స్టేటస్‌కో విధించిన ధర్మాసనం… దాఖలైన పిటిషన్ల సంఖ్య, వాటి తీవ్రత ఆధారంగా రోజువారీ విచారణ జరిపేందుకు గత నెలలోనే అంగీకారం తెలిపింది. ఇవాళ్టి నుంచి విచారణ ప్రారంభంకానుంది. దీంతో అన్ని వివరాలతో విచారణకు రావాలని పిటిషనర్లతో పాటు ప్రతివాదులుకు ఇప్పటికే ఆదేశించింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు రాజధానుల ఏర్పాటుకు తాను అనుకూలమని ఇప్పటికే అఫిడవిట్లు దాఖలు చేశాయి. అయితే విపక్షాలు మాత్రం తాము కొత్త రాజధానులకు వ్యతిరేకమంటూ అఫిడవిట్లు దాఖలు చేశాయి. విపక్షాలన్నీ రైతులకు మద్దతుగా నిలవడంతో ఈ వ్యవహారం చివరికి ఏ మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.