ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. దేశాన్ని రక్షించండి: మమతా బెనర్జీ

ప్రజాస్వామ్యం కొనసాగుతుందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఐదు రోజుల ఢిల్లీ పర్యటన చేపట్టిన ఆమె… కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో సహా పలువురు విపక్ష నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వెళుతూ…ప్రతి రెండు నెలలకొకసారి దేశ రాజధాని పర్యటన ఉంటుందని చెప్పారు. ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసిందన్నారు. ‘ ప్రజాస్వామ్యం ముందుకు సాగాలి. పర్యటన విజయవంతమైంది. రాజకీయ కారణాలతో నా సహచరులను అనేక మందిని కలిశాను. రాజకీయ ప్రయోజనాల నిమ్తితం మేం కలిశాం. మా నినాదం ప్రజాస్వామ్యాన్ని కాపాడండి…దేశాన్ని రక్షించండి. ప్రతి రెండు నెలలకు ఇక్కడకు వస్తాను’ అంటూ వ్యాఖ్యానించారు. తాను నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత శరద్‌ పవార్‌తో ఫోన్‌లో చర్చించానని చెప్పారు. ఆయన ముంబయి వెళ్లారని, ఈసారి కచ్చితంగా కలుస్తానని అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే అందరూ కలిసి పనిచేయాలని మమత సూచించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నట్లయితే దేశం ప్రమాదంలో పడినట్లేనని, కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దేశాన్ని పరిరక్షించండని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష పార్టీల ఐక్యత కన్నా మించింది మరోటి ఉండదని అన్నారు. కోవిడ్‌ నిబంధనలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరినీ కలవలేకపోయానని, మొత్తానికి సమావేశాలు సంపూర్ణంగా ముగిసాయని, కలిసి పనిచేద్దామని విపక్షాలకు పిలుపునిచ్చారు.