ధరణి’ పేరిట నకిలీ యాప్‌.. నిందితుల అరెస్టు..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భూ సమగ్ర సర్వేల కోసం ప్రారంభించిన ధరణి పోర్టల్‌ పేరుతో నకిలీ యాప్‌ను తయారు చేసిన ఇద్దరు నిందితులను సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల గూగుల్‌ ప్లే స్టోర్‌లో ‘ధరణి- తెలంగాణ ల్యాండ్‌ రికార్డ్స్‌’ పేరిట ఓ నకిలీ యాప్‌ కనిపించగా.. రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌(టీఎస్‌టీఎస్‌) ప్రతినిధులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యాప్‌ ఐపీ అడ్రస్‌ ఆధారంగా కర్ణాటకలోని బీదర్‌ జిల్లా బసవకల్యాణ్‌కు చెందిన స్టేషనరీ వ్యాపారి ప్రేమ్‌మూలే(31), ఆయన స్నేహితుడైన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి మహేశ్‌కుమార్‌ దండోత్‌లు ఈ నకిలీ యాప్‌ను సృష్టించి ప్లే స్టోర్‌లో ఉంచినట్లు గుర్తించారు. సైబర్‌ సీఐ రమేశ్‌ ఆధ్వర్యంలో ఓ బృందం కర్ణాటక వెళ్లి నిందితులను అరెస్ట్‌ చేసి శనివారం హైదరాబాద్‌ తీసుకువచ్చింది. ‘ధరణి తెలంగాణ ల్యాండ్‌ రికార్డ్స్‌’ అనే యాప్‌ ప్రభుత్వానిది కాదని, డౌన్‌లోడ్‌ చేసుకొని మోసపోవద్దని సైబర్‌ క్రైం ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కోరారు.