విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దు: ప్రధానికి చంద్రబాబు లేఖ

అమరావతి బ్యూరో : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని కోరుతూ ప్రధాని మోడీకి శనివారం టిడిపి అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో ప్లాంట్‌ను సాధించారని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఎపికే కాదు దేశానికే గర్వకారణమన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉత్తరాంధ్రకు జీవనాడి అని అన్నారు. ఉద్యమ పోరాటంలో అనేకమంది అసువులు బాసారన్నారు. విశాఖ ఉక్కు పోరాటంలో తెన్నేటి విశ్వనాథం, సర్ధార్‌ గౌతు లచ్చన్న, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, నల్లమల గిరిప్రసాద్‌, టి.నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి మహానేతల పోరాటాలు ఉన్నాయన్నారు. స్టీల్‌ప్లాంట్‌ కోసం గుంటూరు జిల్లాకు చెందిన అమృతరావు ప్రాణ త్యాగం చేశారని లేఖలో పేర్కొన్నారు. 68 గ్రామాలకు చెందిన 16 వేల కుటుంబాలు 26 వేల ఎకరాల భూములిచ్చాయని లేఖలో తెలిపారు. గతంలో స్టీల్‌ప్లాంట్‌కు నష్టాలు వచ్చాయని బిఐఎఫ్‌ఆర్‌కు రెఫర్‌ చేశారని, అప్పట్లో రాష్ట్రప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం రూ.1033 కోట్ల ప్యాకేజీ ఇచ్చిందన్నారు. పునర్నిర్మాణ ప్యాకేజీతో ప్లాంట్‌ లాభాల బాట పట్టిందన్నారు. సొంత గనులు లేకపోవడం వల్లే స్టీల్‌ ప్లాంట్‌ నష్టాల్లోకి వెళ్లిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సొంత గనులు ఏర్పాటు చేయాలని చంద్రబాబు లేఖలో విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ భూములు రూ.2 లక్షల కోట్లు విలువ చేస్తుందని, స్టీల్‌ ప్లాంట్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ప్రధానిని కోరారు.