రామ మందిరానికి విరాళాల వెల్లువ – 2రోజుల్లోనే రూ.100కోట్లు..

అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.100 కోట్ల వరకు విరాళాలు వచ్చినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఆదివారం మీడియాకు చెప్పారు..

దాతల నుంచి సేకరించిన విరాళాలకు సంబంధించిన పూర్తి సమాచారం ట్రస్ట్ ప్రధాన కార్యాలయానికి చేరవలసి ఉందని, ఇప్పటిదాకా కార్యకర్తలు చెప్పిన పైపై సమాచారం ప్రకారమే విరాళాల రూపంలో రూ.100 కోట్లు వచ్చినట్లు అంచనా అని చంపత్ రాయ్ తెలిపారు. రామాలయం నిర్మాణం 39 నెలల్లో పూర్తవుతుందని, బహుశా 2024కు ముందే పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు..

అయోధ్యలో మందిర నిర్మాణం కోసం శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని జనవరి 15 నుంచి ప్రారంభించింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రూ.100కోట్ల విరాళాలు రావడం గమనార్హం. విరాళాల కార్యక్రమం ఫిబ్రవరి 27 వరకు కొనసాగనుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ ట్రస్టును అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం రూ.5,00,100 విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి విరాళం ఇవ్వడంపై కొందరు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో చంపత్ రాయ్ మాట్లాడుతూ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఓ భారతీయుడని, భారతీయ ఆత్మ శ్రీరామచంద్రుడని అన్నారు. ఈ గొప్ప లక్ష్యం కోసం విరాళం ఇవ్వగలిగినవారు ఇవ్వవచ్చునని, దీనిలో తప్పేమీ లేదని అన్నారు.