ద్వారంపూడి దోపిడీలను ప్రశ్నిస్తే కేసులు

కాకినాడ సిటి: కాకినాడ సిటి నియోజకవర్గ ప్రజాప్రతినిధి ద్వారంపూడి చేస్తున్న అవినీతి అక్రమాలను, దోపిడీలు దురాగతాలను ప్రశ్నిస్తే ఎదురు కేసులు పెట్టించడం పరిపాటిగా మారిందనీ ఈ విధంగా చేస్తే ప్రజలు భయపడి చేతులు ముడుచుకుని కూర్చుంటారు అనుకోవడం ద్వారంపూడి అవివేకం అని కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక సిద్ధార్థ నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న బియ్యం అక్రమ రవాణా ద్వారా 15 వేల కోట్ల రూపాయలు సంపాదించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నుండి కాకినాడ సిటీలోకి భారీ ఎత్తున గంజాయి తరలించి కోట్ల రూపాయలు అక్రమ ఆర్జనకు పాల్పడుతూ యువత భవిష్యత్తును నిర్వీర్యం చేయడం వాస్తవం కాదా అన్నారు. వందల కోట్లు విలువచేసే ప్రభుత్వ ఆస్తులు రెవిన్యూ శాఖ హెచ్చరిక బోర్డులు పెట్టినా వాటిని ప్రైవేట్ పరంగా మార్చి కబ్జా చేసిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో రామేశంపేట వందల ఎకరాల్లో గ్రావెల్ క్వారీని అక్రమ మైనింగ్ ద్వారా దోచేయడం నిజం కాదా అన్నారు. కాకినాడ శివారు దుమ్ములపేట సమీపంలో మడ అడవులు ధ్వంసం చేసి చదును చేసి కబ్జాకు చేసిన ప్రయత్నాలు వాస్తవం కాదా అన్నారు. కాకినాడ మత్స్యకారులు జీవనోపాధి పొందే కుంభాభిషేకం రేవు ప్రాంతంలో అధికారం అడ్డం పెట్టుకుని వైకాపా పార్టీకి మత్స్యకారులు అనుకూలం కాదని భావించి అక్రమంగా గోడలు కట్టించిన చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకారులకు జీవనోపాధి లేకుండా చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను జనసేన పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందని కేసులకు భయపడి మౌనంగా ఉండే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇన్ని ప్రశ్నలు సంధిన్చిన తనపై పోలీసులు కేసు నమోదు చేసినా ఎటువంటి ఇబ్బంది లేదని శశిధర్ తెలిపారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం అటక ఎక్కించి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరచి భారత రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా సహాయ కార్యదర్శి బడే వెంకటకృష్ణ, చొడిశెట్టి శ్రీమన్నారాయణ, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.