బోరబండలో మళ్లీ భూ ప్రకంపనలు

హైదరాబాద్‌ నగరంలోని బోరబండలో మళ్లీ భూప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి భారీ శబ్ధాలు వస్తుండంతో జనం భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. భారీ శబ్ధాలతో 4 సెకన్ల పాటు భూమి కంపించింది.

రెండ్రోజుల కిందట హైదరాబాద్ లోని బోరబండ, రహ్మత్ నగర్, సైట్-3 ఏరియాల్లో భూమి కంపించడం, భారీ శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇవాళ మధ్యాహ్నం కూడా అదే తరహాలో మరోసారి భూమి కంపించడంతో ప్రజలు హడలిపోయారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. రెండ్రోజుల క్రితం వచ్చిన శబ్దాల కంటే ఈసారి మరింత బిగ్గరగా శబ్దాలు రావడంతో ప్రజలు ఏం జరుగుతోందో తెలియక జనం భయంతో వణికి పోయారు.

భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 0.8 నమోదయినట్లు ఎన్‌జీఆర్ఐ (National Geophysical Research Institute) అధికారులు వెల్లడించారు. కొన్ని రోజులుగా వరుసగా భూమి పొరల నుంచి శబ్దాలు వస్తుండడంతో బోరబండ ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయ భ్రాంతులకు లోనవుతున్నారు. రెండు రోజుల క్రితం వచ్చిన శబ్దాలతో NGRI అధికారులు బోరబండలోని పలు కాలనీల్లో పర్యటించారు. భూకంప తీవ్రతను కొలిచేందుకు మూడు ప్రాంతాల్లో సిస్మోగ్రాఫ్ పరికరాలను ఏర్పాటు చేశారు. అక్టోబరు 2న వచ్చిన ప్రకంపనల 1.4 తీవ్రత ఉండగా.. ఇవాళ మాత్రం 0.8 తీవ్రత నమోదయింది. తీవ్రత చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు భయపడాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.