Eid Mubarak: ఇంట్లోనే రంజాన్‌ ప్రార్థనలు

ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పర్వదినం రానేవచ్చింది. ఈ రోజు (మే 14) శుక్రవారం కావడం.. అందులోనూ రంజాన్‌ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు ముస్లింలు. అయితే కోవిడ్ కట్టడిలో భాగంగా ఈసారి ఇంట్లోనే ప్రార్ధనలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం కొద్ది మందికి మాత్రమే ప్రార్థనా మందిరాల్లో నమాజ్ చదివే అవకాశం లభించనుంది. గతేడాది తరహాలోనే… ఈ ఏడాది కూడా ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని రూల్స్ పాస్ అయ్యాయి.

లాక్‌డౌన్‌తో ఈసారి రంజాన్ శోభ హైదరాబాద్‌లో అంతంత మాత్రంగానే కనిపించనుంది. ఈ ఏడాది కూడా శుభాకాంక్షలను సెల్‌ఫోన్‌ మెసేజ్‌లతో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రంజాన్‌ను ఇంట్లోనే జరుపుకోవాలని వక్ఫ్ బోర్డు, ప్రభుత్వం విజ్ఞప్తి చేశాయి. ఆయా బస్తీలు, కాలనీల్లోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ప్రార్థనా మందిరాల్లో కేవలం నలుగురికి మాత్రమే అనుమతి ఉంది. ఆ నలుగురు కూడా వక్ఫ్ బోర్డు నుంచి అనుమతి తీసుకోవాలి.

మిగతా వారంతా ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు నిర్వహించుకోవాలన్నారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌. ఇక రంజాన్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో పోలీసు బందోబస్తును మరింత పటిష్టం చేశారు. పాతబస్తీలో రెండు వేల మంది పోలీసులు మోహరించారు. అదనంగా మరో 500 మంది సిటీ కాప్స్‌తో బందోబస్తు నిర్వహించనున్నారు.