ఉత్కంఠగా మారిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, MLC ఓట్లు చెల్లవట

ఏపీలో పురపాలక, నగరపాలక ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఏపీ ప్రజలు సైతం అధికార వికేంద్రీకరణకు ఓటు వేసి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి మద్దతు తెలిపారు. అనంతరంపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలు మినహా అన్ని మున్సిపాలిటీలలోనూ వైఎస్సార్‌సీపీ విజయదుందుబి మోగించింది.

పంచాయతీ ఎన్నికల ఫలితాలతో పోల్చితే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైస్సార్‌సీపీ మరింత ప్రభంజనం సృష్టించింది. అయితే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సత్తా చాటిన మున్సిపాలిటీ తాడిపత్రి చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇక్కడ మొత్తం 36 వార్డులుండగా, ఎన్నికలకు ముందే వైఎస్సార్‌సీపీ 2 వార్డులు ఏకగ్రీవం చేసుకోగా, మిగిలిన 34 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. అధికార వైఎస్సార్‌సీపీ 14 వార్డులు, టీడీపీ 18 వార్డులు, సీసీఐ, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కో వార్డులో గెలుపొందారు. చైర్మన్ ఎన్నిక కోసం ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారాయి.

చైర్మన్ పదవి ఎన్నికలో భాగంగా ఎక్స్ అఫీషియో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న ఎమ్మెల్సీల దరఖాస్తులను మున్సిపల్ కమిషన్ నరసింహ ప్రసాద్ రెడ్డి తిరస్కరించారు. వాస్తవానికి టీడీపీ తరఫున ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ తరఫున ముగ్గురు ఎమ్మెల్సీలు దరఖాస్తు చేసుకోగా, వీరి దరఖాస్తులు తిరస్కరించడంతో పాటు వీరికి ఓటు హక్కు లేదని తెలిపారు. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీల ఓట్లు మాత్రమే చెల్లుతాయని ట్విస్ట్ ఇచ్చారు.

ప్రస్తుతం టీడీపీ బలం 18గా ఉండగా, వీరికి సీపీఐ, ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు తెలుపుతున్నారు. దీంతో వీరి బలం 20కి పెరిగింది. వైఎస్సార్‌సీపీ బలం 18గా ఉంది. తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వరకు మరెన్ని మార్పులు చోటుచేసుకుంటాయోనని ఇరు పార్టీల నేతలు యోచిస్తున్నారు. అయితే లేక లేక గెలుపొందిన స్థానాన్ని కైవసం చేసుకుని చైర్మన్ ఎంపిక వరకు జాగ్రత్తగా ఉండాలని ప్రతిపక్ష టీడీపీ భావిస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అందించిన మెజార్టీతో వైఎస్సార్‌సీపీకి తిరుగు లేకుండా పోయింది.