రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్నికల పొత్తులు: సోమరౌతు అనురాధ

వేమూరు, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం కోసమే జనసేన నేత పవన్ కళ్యాణ్ బిజెపి టిడిపితో పొత్తు పెట్టుకున్నారని జనసేన పార్టీ కార్యదర్శి సోమరౌతు అనురాధ పేర్కొన్నారు. శనివారం వేమూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలుగుదేశం జనసేన పార్టీలతో బిజెపి పొత్తు కలవడం శుభపరిణామమని పొత్తుతో రానున్న ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని ఆమె తెలియజేశారు. జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ ఏనాడూ అధికారం కోసం పాకులాడే మనిషి కాదని కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలు నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకే తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేసేందుకు అంగీకరించారని గుర్తు చేశారు. జనసేన పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు తెలుగుదేశం జనసేన అభ్యర్థులను గెలిపించేందుకు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. వేమూరు నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి నక్క ఆనంద్ బాబు గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయని తెలియజేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు అంటూ మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని, అదేవిధంగా డ్వాక్రా మహిళలను మరోసారి వంచించేందుకు ప్రయత్నిస్తున్నారని దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనురాధ తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నిన ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. తెలుగుదేశం-జనసేన, కార్యకర్తలు సమన్వయంతో ఎన్నికల్లో ముందుకు సాగాలని సోమరౌతు అనురాధ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చావలి ఎంపిటిసి గాజుల నగేష్, ఎంపీటీసీ వెలివెల సుబ్రమణ్యం, సోమరౌతు బ్రహ్మం, మూల్పూర్ రమేష్, పోతురాజు, తాడికొండ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.