అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం దుర్మార్గం: ఆళ్ళ హరి

గుంటూరు, తన అరాచకపాలనతో ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకత నేపధ్యంలో ఓటమి కళ్ళముందే కనపడటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూర్ఖత్వం పరాకాష్టకు చేరిందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై 26రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించటంపై శనివారం ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిచ్చుకపై బ్రహ్మస్త్రం లాగా సేవా భావంతో అతి తక్కువ వేతనంతో సేవలందించే అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించటం శోచనీయమని మండిపడ్డారు. అంగన్వాడీల ఆత్మగౌరవానికి – జగన్ రెడ్డి అహంకారానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో చివరికి అంగన్వాడీలే విజయం సాధిస్తారన్నారు. అంగన్వాడీ టీచర్లు , వర్కర్లు అడుగుతున్నవి అత్యంత న్యాయసమ్మతమైన డిమాండ్లేనన్నారు. అందులోనూ అంగన్వాడీలకు జగన్ రెడ్డి ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటున్నారన్నారు. అది కూడా అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత అని గుర్తుచేశారు. జీఓ నెంబర్ రెండుతో అంగన్వాడీలను ప్రభుత్వ అత్యవసర సేవల్లోకి తీసుకురావడం దుర్మార్గమన్నారు. గౌరవ వేతనం తీసుకునేవారు ప్రభుత్వ ఉద్యోగుల కిందకి ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. 26 రోజుల తరువాత అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులని ముఖ్యమంత్రికి గుర్తుకొచ్చిందా అని దుయ్యబట్టారు. అంగన్వాడీ ఉద్యమానికి మొదటినుంచి జనసేన పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని, అంగన్వాడీలకు తీసుకునే ఎలాంటి నిర్ణయాలకైనా జనసేన అండగా ఉంటుందని ఆళ్ళ హరి అన్నారు.